11-11-2025 01:27:15 AM
- వినియోగంలోకి రాక చివరి మజిలీకి ఇబ్బందులు
- రూ.10 లక్షల నిధులు దుర్వినియోగం
కొల్చారం, నవంబర్ 10 :గ్రామాలలో స్మశానవాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి పడుతున్న ఇబ్బందులను దూరం చే యాలని గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాలలో వైకుంఠధామాలు ఏ ర్పాటు చేసింది. మండలంలోని వ్యాపార కేంద్రమైన రంగంపేటలో రూ.10 లక్షలతో వైకుంఠధామం ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షలు వెచ్చించిన వైకుంఠధామం వినియోగంలోకి రాక వృధాగా మారింది.
గ్రామ శివారులోని అవుసులోని కుంటలో నిర్మించిన వైకుంఠధామంలోకి కొద్దిపాటి వర్షానికి నీరు వచ్చి చేరుతుంది. దీంతో చివరి మజిలీ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవుసులోని కుంట శిఖంలో ఈ వైకుంఠధామం నిర్మించడం వల్ల లక్షలాది ప్రజాసొమ్ము దుర్వినియోగం అయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అవుసులోని కుంట శిఖంలో వైకుంఠధామం నిర్మిస్తుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఏమి చేశారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. శిఖంలో నిర్మించిన వైకుంఠధా మానికి నిధులు ఎలా మంజూరు చేశారని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తే అధికారులు తమకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు.
విచారణ జరిపి చర్య తీసుకుంటాం..
రంగంపేటలో అవసులోని కుంటలో శిఖం భూమిలో వైకుంఠధామం నిర్మించారని ఫిర్యాదు వచ్చిందని, విచారణ జరిపి సంబంధించిన వ్యక్తులఫై చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసచారి, తహసీల్దార్