9 May, 2026 | 2:00 AM

ఆదాయం పెంపుపై దృష్టి సారించాలె

31-08-2024 04:00 AM

కొత్త ప్రణాళికలను రూపొందించాలె

యార్డుల్లో ఇసుక స్టోరేజీ చేయాలె

జీఎస్టీలో లీకేజీలపై యాక్షన్ ప్లాన్  

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రజల పైన ఎలాంటి పన్నుల భారం పడకుండ ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకొని అన్ని శాఖల్లో ఆదాయం పెంపు పై దృష్టి సారించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. రాష్ర్ట ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై పలు కీలక శాఖలతో శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదా యం పెంపుపై జరిగే సమావేశానికి కొత్త ప్రణాళికలతో రావాలని సూచించారు.

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామ న్నారు. ఖజానాకు ఆదాయం పెంచేందుకు ఆయా శాఖల్లో అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు. అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలో సబ్ యార్డులు, అసెం బ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో వేగం పెంచాలని, రాష్ర్టవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటివరకు సమకూరిన ఆదాయం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఏ మేరకు ఆదా యం అంచనా వేయవచ్చు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలను సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయం లో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావద్దని ఆదేశించారు. రాష్ర్ట ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒకటని, ఈ అంశం లో లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.

సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ కమిషనర్ రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ , రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతం, మైనింగ్ శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ సుశీల్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.