ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
హాజీపూర్, జూలై 28 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారిణి (డీఏఓ) సురేఖ కోరారు. మండలంలోని గుడిపేట రైతు వేదికలో ‘రైతు నేస్తం 100వ ఎపిసోడ్’ను వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం రైతులనుద్దేశించి డీఏఓ మాట్లాడారు. ఎల్ నేనో ప్రభావం తో తక్కువ వర్షపాతం నమోదైందని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు.
ఎకరం వరి పంట సాగు నీటితో నాలుగు నుంచి ఐదు ఎకరాల ఆరుతడి పంటలు సాగవుతాయన్నారు. జిల్లాలోని ప్రతి రైతు వేదికలో విత్తన మేళ జరుగుతున్నాయని, ఈ మేళాలో రైతులకు అవసరమైన కందులు, పెసర, నువ్వులు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అభ్యుదయ రైతులుగా గుర్తించిన పుస్కూరి శ్రీనివాస రావు (హాజీపూర్), సంతోషం శ్రీలత (చెన్నూరు), మోర్ల భీమర (భీమిని)లతో పాటు ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు మధుప రెడ్డి (గుడిపేట రైతు వేధిక, హాజీపూర్) సంతోష్ కుమార్ (జన్కపూర్ రైతు వేధిక, కన్నెపల్లి)లను మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏడీఏ మామిడి క్రిష్ణ, ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళి, ఎఫ్ పీ ఓ డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, బొడ్డు శంకర్, మందమర్రి పీఏసీఎస్ చైర్మన్ గుళ్ళకోట ప్రభాకర్ రావు, మంచిర్యాల ఏఎంసీ డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, హాజీపూర్ ఏఓ క్రిష్ణ, ఏఈఓ మధుప రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.






