14 August, 2026 | 2:26 AM

ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌లో నాణ్యతా లోపాలు

14-08-2026 12:00 AM

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఇబ్రహీంపట్నం/మంచాల, ఆగస్టు 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నిల్వలు, కిచెన్ రూమ్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.తనిఖీ సందర్భంగా వంట గదిలో పాడైపోయిన కూరగాయలు, నాణ్యత లేని బియ్యం నిల్వలు ఉండటాన్ని గుర్తించిన ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం ఆయన స్వయంగా విద్యార్థులతో కలసి కింద కూర్చొని భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

పాఠశాలలో రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం వడ్డించడానికి ముందు కనీసం ఒక ఉపాధ్యాయుడైనా దానిని రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలని హెడ్మాస్టర్కు సూచించారు.ఆహార విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. భోజనం తయారీలో గానీ, నాణ్యతలో గానీ ఎలాంటి అవకతవకలు జరిగినా బాధ్యులైన ఉపాధ్యాయుల జీతం నుంచే డబ్బులు కట్ చేసి, ఆ మొత్తాన్ని విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేస్తాం అని గోలి పేర్కొన్నారు. 

అధికారుల పర్యవేక్షణ ఉండాల్సిందే..

పాఠశాలలో భోజన నాణ్యతపై స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, జీపీఓలు నిత్యం పర్యవేక్షణ (నిఘా) ఉంచాలని ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి 28 మంది సభ్యులతో ఉన్న ’ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ కమిటీ’  సభ్యులు కూడా రోజూ పాఠశాలను సందర్శించి, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.