చిన్నారికి ‘మీకోసం మేమున్నాం’ టీం అండ
కిడ్నీ ఆపరేషన్ బాధితుడి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం
చర్ల, ఆగస్టు 13,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి చికిత్సకు ఆర్థిక చేయూత అందజేసేందుకు ‘మీకోసం మేమున్నాం’ సేవా సంస్థ ముందుకు వచ్చింది. చర్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన గగనం రాజు కుమారుడు గగనం మహేష్ (10) అతి చిన్న వయసులోనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర కాంప్లికేషన్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
పూసలు అమ్ముకునే చిరు వ్యాపారి అయిన రాజు కుటుంబానికి చికిత్స ఖర్చులు భరించడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ‘మీకోసం మేమున్నాం’ టీం ఫండ్ రైజింగ్ పోస్టు ద్వారా విరాళాలు సేకరించింది. మొత్తం రూ.10,000 ను గురువారం చర్లలోని సంస్థ కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు. సంస్థ కార్యవర్గ సభ్యులు శేశెట్టి సాంభశివరావు చేతుల మీదుగా నగదును వారి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ, ఇలాంటి అనుకోని కష్టాలు వచ్చినప్పుడు పేదవారి జీవితాలు అల్లకల్లోలం అవుతాయని అన్నారు. అలాంటి సమయంలో మనం అందించే చిన్న సహాయం కూడా వారికి పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూనెం గౌతమి, కవ్వాల రాము, ముసలి సతీష్, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.






