7 July, 2026 | 2:03 AM

బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్

07-07-2026 01:05 AM

20 మంది విద్యార్థులకు అస్వస్థత

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, చికిత్స

విద్యార్థులను పరామర్శించిన ఆర్డిఓ రవీందర్ రెడ్డి

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం

బాన్సువాడ, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనతో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.ఘటన వివరాల ప్రకారం పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు విరేచనాలు, వాంతులు మొదలయ్యాయి.

వారిలో 12 మంది పరిస్థితి విషమించడంతో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది వెంటనే అంబులెన్సుల ద్వారా బాధితులను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అందరికీ చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవో ఆదేశించారు.

ఆదివారం ఉదయం వాడిన నూనెనే రాత్రి పూరీలకు వాడటం వల్లే ఈ సమస్య వచ్చిందని కొందరు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఆహారంలో నాణ్యత లేకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే బీర్కూర్ సర్పంచ్ అరిగె ధర్మతేజ సోమవారం ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు. వంటశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫుడ్ పాయిజన్కు గల ఖచ్చితమైన కారణంపై వైద్య నివేక, అధికారుల విచారణ అనంతరం స్పష్టత వస్తుందని ఆర్డీవో రవీందర్ రెడ్డి తెలిపారు.