10 May, 2026 | 10:53 AM

ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం

10-05-2026 10:02 AM

ఖమ్మంలోని ఓ రెస్టారెంట్‌లో ఘటన

భోజనం చేసిన ఆరుగురికి వాంతులు, విరేచనాలు

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు

కలుషిత ఆహారమే కారణమన్న వైద్యుల అనుమానం

హోటళ్ల పరిశుభ్రతపై మళ్లీ ప్రశ్నలు

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పనితీరుపై ప్రశ్నలు

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటన మరో సారి కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని మమత ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌లో మంది బిర్యానీ తిన్న ఆరుగురు యువకులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి కి చేరిన సంఘటన శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం సమయంలో యువకులు కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసినట్లు సమాచారం. చికెన్‌ బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వారికి వాంతులు ప్రారంభమయ్యాయి. అనంతరం కడుపునొప్పి, విరేచనాలతో వారు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని సమీప ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో బాధితులు

అస్వస్థతకు గురైన బాధితులకు వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఆస్పత్రుల్లో వారికి సెలైన్‌లు ఎక్కించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ప్రాథమిక పరీక్షల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. కలుషిత ఆహారం లేదా నిల్వ పదార్థాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మరికొన్ని గంటలు పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. బాధితుల నుంచి వారు తీసుకున్న ఆహారంపై పూర్తి వివరాలు సేకరించారు. ఘటనపై అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

హోటల్‌ నిర్వహణపై విమర్శలు

ఈ ఘటనతో సంబంధిత రెస్టారెంట్‌ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి కాలంలో ఆహార పదార్థాల నిల్వ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాడైన పదార్థాలు వాడారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. హోటళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌ వంటశాల పరిస్థితులపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారులపై ఒత్తిడి

ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పనితీరుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలోని హోటళ్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీ ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. నిల్వ మాంసం, గడువు ముగిసిన పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఘటనపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.