10 May, 2026 | 10:58 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి

10-05-2026 10:08 AM

- క్లస్టర్ల వారీగా సమస్యల సేకరణ.. అక్కడికక్కడే పరిష్కారానికి ప్రాధాన్యత

- మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

- తిరుమలాయపాలెం క్లస్టర్ ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తిరుమలాయపాలెం: ప్రజా దర్బార్‌లో స్వీకరించే ప్రతి దరఖాస్తును మూడు నెలల కాలపరిమితిలోపు పరిష్కరించేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన సభల్లో 14,700 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, ఉచిత విద్యుత్ కోరుతూ వచ్చినవేనని పేర్కొన్నారు. తక్షణమే పరిష్కరించే వీలున్న వాటిని స్పాట్‌లోనే పూర్తి చేస్తున్నామని, మిగిలిన వాటిని  మూడు నెలల గడువులోపే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మే నెలాఖరు నుంచి రెండో విడత ఇళ్లు

ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. మే నెలాఖరు నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ధరణి చిక్కుముడులకు 'భూ భారతి'

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తప్పుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి విమర్శించారు. ఒకే సర్వే నంబర్‌లోని కొంత భూమి సేకరణ జరిగితే.. మొత్తం నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడం వంటి అవకతవకలను సరిదిద్దడానికే 'భూ భారతి' కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. సాదా బైనామా దరఖాస్తులను పేదలకు న్యాయం జరిగేలా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోళ్లపై భరోసా

రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, వరితో పాటు మొక్కజొన్నను కూడా పూర్తిస్థాయిలో సేకరిస్తామని తెలిపారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఇప్పటికే రూ.2 లక్షల లోపు రుణమాఫీని అమలు చేశామని చెప్పారు. గతంలో రైతులపై బేడీలు వేసిన వారు నేడు కొనుగోలు కేంద్రాల వద్ద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.