నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 16 (విజయక్రాంతి): ఈనెల 21 న జరుగనున్న నీట్ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షకు జిల్లా నుండి 3 వేల 311 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో ఉన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభర్థులకు కరెంట్, మంచినీరు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైద్య అధికారులు మెడికల్ కిట్, అంబులెన్సలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్తు సరఫరా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్ వంటి వాటిని అందుబాటులో ఉండేలా డిడబ్ల్యూఓ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డిఓలు వెంకట్ రెడ్డి, శ్యాంప్రకాష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






