22 July, 2026 | 2:21 AM

టీడీపీకి 4 జేడీయూకు 2

09-06-2024 01:43 AM

మోదీ క్యాబినెట్‌లో చోటుపై క్లారిటీ! 

రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగికి చోటు

దగ్గుమల్ల  ప్రసాద్‌కూ అవకాశం 

జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌కు బెర్త్‌లు

టీడీపీకి స్పీకర్ పదవిపై ఇంకా రాని స్పష్టత 

ఎంపీల ప్రమాణస్వీకారం తర్వాతే కొలిక్కి?

న్యూఢిల్లీ, జూన్ 8: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇవాళ సాయంత్రం నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మోదీ క్యాబినెట్‌లో ఎవరెవరిని తీసుకుంటారనే దానిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ, జేడీయూకు ఏయే మంత్రిత్వ శాఖలు అప్పజెప్తారనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది.

ఎవరెవరికి ఎన్ని? 

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి చోటు దక్కనుంది. శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో శాఖల కేటాయింపుపై చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మోదీ క్యాబినెట్‌లో టీడీపీకి నాలుగు బెర్త్‌లు ఖాయం అయినట్లు తెలుస్తోంది. జేడీయూకు రెండు బెర్త్‌లు ఇస్తున్నట్టు సమాచారం. టీడీపీ నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీలు రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్‌లకు కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్టు తెలిసింది. ఇక, నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ నుంచి సీనియర్ లీడర్లయిన లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌కు క్యాబినెట్ పదవులు దక్కనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. లలన్ సింగ్ బీహార్‌లోని ముంగేర్ లోక్‌సభ నుంచి గెలుపొందారు. ఇక రామ్‌నాథ్ ఠాకూర్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 

స్పీకర్ పోస్టు కోసం టీడీపీ పట్టు.. 

16 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌మేకర్‌గా నిలిచిన టీడీపీ.. నాలుగు మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కావాలని అడుగుతోంది. ఇక 12 సీట్లతో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చిన జేడీయూ రెండు బెర్త్‌లు అడిగింది. స్పీకర్ పోస్టును వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. డిప్యూటీ స్పీకర్ పోస్టు టీడీపీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.