నేడు మోదీ పట్టాభిషేకం
రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 7.15 గంటలకు ముహూర్తం
పలు దేశాల అధినేతల హాజరు.. భారీగా భద్రత
న్యూఢిల్లీ, జూన్ 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమా ణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా, కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేయనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో పాటు కేంద్రమంత్రులుగా నియమితులైన వారు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కేంద్ర మంత్రులుగా ఎవరిని నియమించాలో వారికి సంబంధించిన జాబితా ఇప్పటికే రాష్ట్రపతికి అందినట్టు సమాచారం. తొలుత ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయాలని భావించినట్టు తెలిసింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రమాణ వేదికను మార్చినట్టు తెలుస్తోంది.
మూడంచెల భద్రత..
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులకు చెందిన స్వాట్ విభాగం, ఎన్‌ఎస్‌జీ భద్రతా బలగాలను ప్రధాని ప్రమాణం చేసే వేదిక చుట్టూ మోహరించనున్నారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక, దేశ రాజధాని ప్రాంతం మొత్తం నో ఫ్లుయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, పారా గ్లుడర్లు, విమానాలు, హాట్ ఎయిర్ బెలూన్లు ఇవాళ, రేపు ఎగరేయడంపై నిషేధం విధించారు.
దేశ విదేశాల నుంచి అతిథులు..
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అతిథులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు తదితర దేశాల అగ్రనేతలు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటివకే వారంతా భారత్‌కు చేరుకున్నారు. వారందరికీ హోటళ్లలో ప్రత్యేక వసతి కల్పించారు. కార్యక్రమానికి వారు హాజరై, తిరిగి హోటల్‌కు చేరుకునేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీ చేరుకునే అన్ని దారులను ఇప్పటికే మూసేశారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు .
హాజరయ్యే అతిథులు వీరే..
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దాహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్‌గే.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వీరితో పాటు సార్క్ దేశాలకు చెందిన పలువురు నేతలు కూడా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.






