22 July, 2026 | 2:53 AM

నితీశ్‌కు ఇండియా పీఎం ఆఫర్

09-06-2024 01:41 AM

కూటమిలో చేరితే  ప్రధాని చేస్తామన్నారు: జేడీయూ నేత కేసీ త్యాగి 

ఈ విషయం తమకు తెలియదని కాంగ్రెస్ కౌంటర్

న్యూఢిల్లీ, జూన్ 8: గత పదేళ్లుగా దేశంలో బీజేపీకి పోటీ లేకుండా పోయింది. 2014, 2019లో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి లో సత్తా చాటలేకపోయింది. కానీ, 2024 లో విపక్ష పార్టీలన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీకి గట్టి పోటీనిచ్చాయి. అందుకే బీజేపీ ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో కూటమిలోని జేడీయూ, టీడీపీపై ఆధారపడి అధికారంలోకి వస్తోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ కూటమి దాదాపు గెలుపు అంచుల వరకు చేరింది. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించ లేదు. ఈ నేపథ్యంలో పలు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. 

భారీ ఆఫర్..

ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. కూటమిలో నితీశ్ చేరితే ప్రధానమంత్రి పదవిని ఇస్తామని చెప్పినట్లు త్యాగి తెలిపారు. అయితే, నితీశ్ మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించారని వెల్లడించారు. కొంతమంది ఇండియా కూటమి నేతలు నితీశ్‌కుమార్‌ను ప్రధానమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ విషయంపై నితీశ్‌ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మేం మాత్రం ఎన్డీయే కూటమితోనే ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు అని త్యాగి పేర్కొన్నారు. 

మాకు తెలియదు..

ఇంతకుముందు కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి తీవ్రంగా ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. ఇందుకోసం ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలను తన కూటమిలో చేర్చుకునేందుకు చూసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో నితీశ్‌కు ఇండియా కూటమి ఇచ్చిన అవకాశం గురించి త్యాగి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్యాగి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై కాంగ్రెస్‌కు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం త్యాగికి మాత్రమే తెలుసని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఎద్దేవా చేశారు.