15-11-2025 12:17:43 AM
జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14, (విజయక్రాంతి):అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గిరిజనులు పోడు నరికకుండా చూడటం అత్యవసరమని, ఇందుకోసం వారికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పించడం కీలకమన్నారు.జిల్లాలో గుత్తికోయ గిరిజనుల నివాస గుంపులు, వారి జనాభా, అవసరమైన సౌకర్యాలపై పూర్తి నివేదికలను సిద్ధం చేసి, ఆ నివేదికల ఆధారంగా వారికి తగిన ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అటవీ సంరక్షణ భవనాలను నిర్మించి వాటి ద్వారా గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.గిరిజనులకు చేపల పెంపకం శిక్షణ, లైవ్లీహుడ్ షెడ్ల ఏర్పాటు వంటి జీవనోపాధి కార్యక్రమాలు చేపడితే పోడు నరికే పరిస్థితులు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జీవనోపాధి కల్పించిన తర్వాత కూడా ఎవరైనా పోడు నరికితే పీడీ యాక్ట్ అమలు చేయాలని హెచ్చరించారు.ఇప్పటికే నరికిన పోడు ప్రదేశాల్లో వెంటనే వెదురు మొక్కలు నాటాలని సూచించారు. జిసిసి ద్వారా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ను పెంపొందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ఇప్ప చెట్ల సర్వే నిర్వహించి, రాబోయే సీజన్లో ఒక్క ఇప్పపువ్వు కూడా వృథా కాకుండా నెట్లతో సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యమైన ఇప్పపువ్వుకు కిలోకు 2000 వరకు ధర లభిస్తుందని, తుమ్మజిగురు, శంకుపుష్పం వంటి విలువైన అటవీ ఉత్పత్తులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గుత్తికోయ యువతకు ఫర్నిచర్ తయారీ రంగంలో అవకాశాలు ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా శాఖలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ కోసం శాఖ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందని, గిరిజనుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోడు ప్రదేశాలను గుర్తించి అక్కడ పునర్వనీకరణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూఅటవీ భూముల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.
పోడు నరికే సంఘటనలను త్వరితగతిన గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీ చట్టాల అమలులో ఇతర శాఖలతో సమన్వయం మరింత బలపడేలా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.