15-11-2025 12:18:12 AM
గ్రామంలో డ్రైనేజ్ సమస్యపై స్థానికుల ఆగ్రహం!!
పట్టించుకోని అధికారులు
శివ్వంపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పదో వాడలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉధృతమవుతోంది. పొరుగువారు డ్రైనేజ్ నీరు, చెత్తను అడ్డగోలుగా రోడ్డు పక్కకు వదిలేయడంతో ఆ ప్రాంతం పూర్తిగా కుంటలా మారిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, దోమలు, ఈగలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, మిషన్ భగీరథ ట్యాంక్ పక్కన, రోడ్డు ఒడ్డున పెద్ద ఎత్తున పడేసిన చెత్తతో ఆ ప్రదేశం డంపింగ్ యార్డ్‌లా మారిపోయింది. పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, సెక్రటరీని సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల నివాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వర్షాలతో నిల్వనిల్లు పెరిగి, ఇంటి గోడలకు కూడా నీరు తాకే స్థాయికి చేరిందని నివాసితులు తెలిపారు. దోమల పెరుగుదలతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి అసలు ఉన్నారా ఉంటే “కనీసం ఇప్పటికైనా స్పందించాలి. మా సమస్యలకు పరిష్కారం చూపాలి” అని స్థానికులు కోరుతున్నారు.