విద్యుదాఘాతంతో అటవీ ఉద్యోగి మృతి
- జంతువుల వేటకు అమర్చిన తీగ ఉచ్చులో బలి
- భద్రాద్రి జిల్లా -నకిరిపేటలో విషాదం
బూర్గంపాడు, ఆగస్టు 12 (విజయక్రాంతి): అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చు అటవీ శాఖ ఉద్యోగి ప్రాణాలను బలిగొంది. వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గుర్తించేందుకు వెళ్లిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అటవీ ప్రాంతంలో కొందరు అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. డీఆర్వో కుర్సం అనార్కలి ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్, ఇతర సిబ్బంది నకిరిపేట గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు.
వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వ్యక్తుల కోసం గాలిస్తుండగా నవీన్ ప్రమాదవశాత్తు విద్యుత్‌కు తగిలి షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలను ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబులపై అటవీ శాఖ అధికారులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బూర్గంపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






