22 June, 2026 | 7:05 AM

ఫారెక్స్ సరికొత్త రికార్డు

15-06-2024 12:05 AM
  • 655.8 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు

ముంబై, జూన్ 14: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డుస్థాయికి చేరాయి. శుక్రవారం ఆర్బీఐ విడుద ల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 7తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 4.307 బిలియన్ డాలర్లు పెరిగి 655.817 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.  ఇవి మే 31తో ముగిసినవారంలో 4.837 బిలియన్ డాలర్ల మేర పెరిగి  651.51 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అది కూడా రికార్డుస్థాయి కాగా, తాజా సమీక్షావారంలో ఆ స్థాయిని అధిగమించడం గమనార్హం.

కొద్దివారాలుగా ఈ నిల్వలు జోరుగా పెరుగుతున్నాయి.  జూన్ 7తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.773 బిలియన్ డాలర్లు పెరిగి 576.337 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలు పెరిగాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 481మిలియన్ డాలర్ల మేర పెరిగి 56.982 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 43 మిలియన్ డాలర్లు ఎగసి 18.161 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 10 మిలియన్ డాలర్లు  పెరిగి 4.336 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.