22 June, 2026 | 5:54 AM

38 బిలియన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు

15-06-2024 12:05 AM
  • ఏడు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

న్యూఢిల్లీ, జూన్ 14: ఈ ఏడాది మే నెలలో దేశం నుంచి వాణిజ్య ఎగుమతులు 38.13 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 34.95 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే 9 శాతం వృద్ధిచెందాయి. 2024 మే నెలలో దిగుమతులు కూడా 7.7 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్ల నుంచి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్యలోటు కూడా అంచనాల్ని మించి ఏడు నెలల గరిష్ఠస్థాయి 23.78 బిలియన్ డాలర్లకు పెరిగింది.  2023 అక్టోబర్‌లో నమో దైన 31.46 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు తర్వాత ఇదే అధికం.

రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్‌లో ఎకనామిస్టులు వాణిజ్యలోటు 19.50 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు  నెలకొన్నప్పటికీ, సమీక్షా నెలలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్ రంగాలు ఎగుమతుల వృద్ధికి దోహదపడ్డాయి. భారత్ నుంచి యూఎస్, నెదర్లాండ్స్, యూఏఈ, మలేషి యా, యూకేలకు అధికంగా ఎగుమతులు  జరుగుతున్నాయి. 

లోటు పెరుగుదల సమస్య కాదు

తాజా వాణిజ్య గణాంకాల్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భర్తాల్ శుక్రవారం మీడియాకు వెల్లడిస్తూ మే నెలలో ఎగుమతులు జోరుగా పెరిగాయని, రానున్న నెలల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 2024 మే నెలలో ఎగుమతులు 1 శాతం పెరిగి 35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఎగుమతులు 5.1 శాతం వృద్ధితో 73.12 బిలి యన్ డాలర్లకు పెరగ్గా, దిగుమతులు 8.89 శాతం వృద్ధిచెంది 116 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ధనిక దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున, కొనుగోలు శక్తి పెరిగి, ఆ దేశాల్లో దిగుమతులకు డిమాండ్ ఏర్పడుతుందని భర్తాల్ చెప్పారు.

వాణిజ్యలోటు పెరగడం ఆందోళనకరమేమీ కాదని, ప్రపంచంలో అధిక వృద్ధి సాధిస్తున్నందున భారత్ లో దిగుమతులకు డిమాండ్ పెరుగుతుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్యం దేశంలోకి వస్తున్నంతకాలం వాణిజ్యలోటుతో సమస్య ఉండదని వివరించారు.  సర్వీసుల ఎగుమతుల్ని పెంచుకోవ డం ద్వారా లోటు తగ్గుతుందని చెప్పారు. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో సర్వీసుల ఎగుమతులు నిరుడు ఇదే నెలలో పోలిస్తే 26.99 బిలియన్ డాలర్ల నుంచి 30.16 బిలియన్ డాలర్లకు చేరాయి. సర్వీసుల దిగుమతులు 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

భారీగా పెరిగిన క్రూడాయిల్ దిగుమతులు

దిగుమతుల విలువ పెరగడానికి ప్రధాన కారణం క్రూడాయిల్ ధరలు పెరుగుదల. 2024 మే నెలలో ముడిచమురు దిగుమతుల విలువ భారీగా 28 శాతం పెరిగి 20 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ విలువ 24.4 శాతం వృద్ధితో 36.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే బంగారం దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గాయి. మే నెలలో 3.3 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది.