calender_icon.png 4 July, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక సలహా కమిటీ ఏర్పాటు

04-07-2025 01:47:55 AM

- చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం నియామకం

- త్వరలోనే మంత్రి జూపల్లితో కమిటీ భేటీ

- ఖరారు కానున్న కార్యాచరణ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): సామాజికాభివృద్ధి, సాంస్కృతిక అంశాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సాంస్కృతిక, సాహిత్యపరంగా చర్చించేందుకు, సూచ నలు, అభిప్రాయాలు స్వీకరించేందుకు సలహా కమిటీని ప్రభుత్వం  ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాంను నియమించింది. సాంస్కృతిక, సాహి త్య, సినీ, పరిశోధనా రంగాల్లో ప్రముఖులు, అనుభవజ్ఞులు, నిష్ణాతులైన 19 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించింది.

కమిటీలో సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినిమా రంగ ప్రముఖులు బీ.నర్సింగ్ రావు, కవి జయరాజ్, రచయిత, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్, రచయిత, సాహిత్య విమర్శకుడు కోయి కోటేశ్వరరావు, రచయిత, ఉద్యమకారులు పసునూరి రవీందర్, కళాకారుడు దరువు ఎల్లన్న, ఏపూరి సోమన్న, నేర్నాల కిషోర్, దరువు అంజన్న, తెలంగాణ ధూమ్‌ధామ్ అంతడుపుల నాగరాజు, ఒగ్గు సంప్రదాయ కళాకారుడు చౌదరిపల్లి రవికుమార్, పల్లె నర్సింహా, థియేటర్ సినిమా రంగం నుంచి ఖాజాపాషా, కవులు, సాహితీవేత్తలు యాకూబ్, జూకంటి జగన్నాథం, రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణలున్నారు. హరికృష్ణ కన్వీనర్‌గా కూడా వ్యవహారిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై ఈ కమిటీ తమ అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు రానున్నది. 

మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్రభారతిలో, టూరిజం ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పరిశోధకులు, సినీ, థియేటర్ రంగంతో పాటు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చించారు. వారి ద్వారా విలువైన సూచనలు, అభిప్రాయాలను తీసుకున్నారు. వ్యసనాలు, చెడు అలవాట్లు, సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కమిటీ పనిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

దీనితో పాటు ప్రభుత్వం చేపట్టే సాంస్కృతిక, సామాజిక అంశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన వంటి కార్యక్రమాలకు వీరి ద్వారా పాటలు, కవితలు, కథలు రాయడంతో పాటు షార్ట్ ఫిల్ములు, డాక్యుమెంటరీలు రూపొందించి విస్తృతంగా మీడియా, సోషల్ మీడియాలో ప్రదర్శించి ప్రచారం కల్పించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాంస్కృతిక సలహా కమిటీని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.

తెలంగాణకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, కళా వారసత్వాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని, అడ్వయిజరీ కమిటీని సంప్రదించి కార్యక్రమాలను నిర్వహిస్తే మరింత విస్తృతంగా, స్పష్టంగా ప్రజలకు చేరువవుతుందని కమిటీ చెప్తోంది. త్వరలోనే కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం నిర్వహించి కమిటీకి మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు సమాచారం. కమిటీ ఎలా పనిచేయాలి, వారి విధులు, ఏ ఏ అంశాలపై అధ్యయనం చేయడం, ప్రచార కార్యక్రమాలను రూపొందించడం వంటి అంశాలు మంత్రి చర్చించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.