04-07-2025 01:48:23 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ‘సామాజిక న్యాయ సమర భేరీ ’ పేరుతో భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో హాజరుకానున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గ్రామ శాఖ, మండల, జిల్లా కమిటీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్లతో కలిపి మొత్తం 40 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశాయి. ఈ సభలో గ్రామ శాఖ అధ్యక్షులతో ఖర్గే నేరుగా మాట్లాడనున్నారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను విజయవంతం చేసిన కొందరు పార్టీ నేతలతో ఖర్గే మాట్లాడే అవకాశం ఉంది. అంతకుముందు గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పీసీసీ సలహాదారు కమిటీ సమావేశం కూడా జరుగనుంది. ఈ సమావేశానికి కూడా మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టు అంశాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఖర్గేకు స్వాగతం పలికిన సీఎం, డిప్యూటీ సీఎం
ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షినటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గురువారం స్వాగతం పలికారు. శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగే సభతో పాటు ఉదయం గాంధీభవన్‌లో నిర్వహించే ఏఏసీ, పీసీసీ సలహాదారు కమిటీ సమావేశాలకు ఖర్గే హాజరుకానున్నారు.
తాజ్ కృష్ణా హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో ఖర్గే సమావేశం అయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితోపాటు రాష్ట్రంలో నెలకొ న్న తాజా రాజకీయ పరిస్థితులపైన ఖర్గే ఆరా తీశారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని, అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించినట్లు సమాచారం.