కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli Dayakar Rao) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్రిక్తతల మధ్య దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. ''కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలంటూ'' దయాకర్ రావు కంటతడి పెట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
సోమవారం నిర్వహించిన తొమ్మిది మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు ఎన్నికల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే వివిధ కారణాలతో వాయిదా పడ్డ తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను మంగళవారం నిర్వహించగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను లక్కీ డ్రాలో గెలుచుకోగా, డోర్నకల్ మున్సిపాలిటీని పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ గెలుచుకుంది. మంగళవారం జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక కోసం డ్రా నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి విజయం సాధించారు. అలాగే తొర్రూరులో నిర్వహించిన డ్రాలో తూణం శ్రవణ్ చైర్మన్ (కాంగ్రెస్) గా ఎన్నికయ్యారు.






