12 June, 2026 | 1:25 AM

ఖమ్మంలో చిన్నారిపై అఘాయిత్యం హృదయ విదారకం

12-06-2026 12:00 AM

బాలిక సాధారణ స్థితికి రావడం కష్టమంటున్న వైద్యులు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

ఘటన వెలుగులోకి తెచ్చిన వ్యక్తిపైనే పోలీసుల దౌర్జన్యం

నిమ్స్‌లో బాధితురాలిని పరామర్శించిన మాజీమంత్రి హరీశ్ రావు

పంజాగుట్ట, జూన్ 11 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలో నాలుగు రోజుల క్రితం 12 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం అత్యంత హృదయ విదారకమని, ఈ ఘటన వింటేనే కళ్లలో నీళ్లు వస్తున్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను మాజీ మంత్రులు హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డిలతో కూడిన బీఆర్‌ఎస్ బృందం గురువారం పరామర్శించింది.

ఈ సందర్భంగా వారు నిమ్స్ వైద్యులతో మాట్లాడి చిన్నారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించడంతో పాటు, తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి పరిస్థితిపై హరీశ్ రావు మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసికందుపై ఇటువంటి దారుణాలు జరిగితే సమాజం తలదిం చుకోవాలన్నారు. బాలిక రెండు చేతులు ఫ్రాక్చర్ అయ్యి తిరిగి నడవలేని స్థితిలో ఉందన్నారు.

ఆమె సాధారణ స్థితికి రావడం చాలా కష్టమని వైద్యులు చెబుతుంటే ఎంతో బాధ కలుగుతోందన్నారు ఒక చిన్నారి జీవితం నాశనమై పోయిందని ఆవేదన చెందారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను ఉరితీసేలా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇంకొకరు ఇటువంటి తప్పు చేయాలంటే భయపడతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. పేషెంట్ పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని హరీశ్ రావు విమర్శించారు. ప్రస్తుతం రోజుకు 5 నుంచి 6 పోక్సో కేసులు నమోదవుతున్నాయన్నారు, వికారాబాద్ జిల్లాలోని యాలాల్, బొమరాజపేట, బషీరాబాద్, మోమిన్ పేటలతో పాటు నిర్మల్లో మైనర్ బాలికలపై జరిగిన వరుస అత్యాచారాలే దీనికి నిదర్శనమన్నారు. ఎన్సిఆర్బి డేటా ప్రకారమే తెలంగాణలో చిన్న పిల్లలపై దాడులు పెరుగుతున్నాయని.. 2024లో 2200 మందిపై పోక్సో కేసులు నమోదు కాగా, 2025లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ సంఖ్య 2400 కు పెరిగిందని గణాంకాలను గుర్తుచేశారు.

కేసీఆర్ హయాంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్లను పటిష్టంగా అమలు చేశామని గుర్తుచేశారు. కానీ నేడు ఆ విభాగానికి అడిషనల్ డీజీగా ఉన్న అధికారికి అదనంగా సిఐడీ, ఏసీబీ బాధ్యతలు అప్పగించి మహిళా భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బాధిత బాలికది అత్యంత పేద కుటుంబమని హరీశ్ రావు పేర్కొన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ప్రైవేటులో రూ. 40 వేలు అప్పు చేసి ఖర్చు పెట్టుకున్నారని హరీశ్ రావు తెలిపారు. నిమ్స్కు వస్తే ఇక్కడ కూడా ప్రభుత్వ డాక్టర్లు మందులు బయట కొనుక్కోమని చెప్పడం ప్రభుత్వ అమానవీయ తీరుకు నిదర్శనమన్నారు.

బయట మెడికల్ షాపుల్లో బాలాజీ మెడికల్ స్టోర్ పేరిట రూ. 3900, రూ. 2350, రూ. 730 లతో డాక్టర్లు రాయించిన మందుల బిల్లులను ఆయన మీడియాకు చూపిస్తూ.. ఎక్కడెక్కడి నుంచో దాతలు ఫోన్ పే ద్వారా పంపిన డబ్బులతోనే ఆ పేద కుటుంబం వేల రూపాయల మందులు కొనుక్కుంటోందని చెప్పారు. ఈ అఘాయిత్యాన్ని వెలుగు లోకి తెచ్చి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం అధ్యక్షుడు ముదిగొండ రాంబాబును కేసు పెట్టి లోపల వేస్తామని ఖమ్మం పోలీసులు బెదిరించడం అత్యంత దారుణమన్నారు. డీజీపీ తక్షణమే సదరు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ బాలికకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డితో కలిసి తాము పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం అందించామన్నారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు ప్రకటించారు.