ఎక్కడా సక్కగా కొనుగోళ్లు చేస్తలేరు
మాజీ మంత్రి రెడ్యానాయక్ విమర్శలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యం, మొక్క జొన్న పంట ఉత్పత్తులను ఎక్కడ కూడా సక్కగా కొనుగోలు చేస్తలేరని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి డి.ఎస్ రెడ్యానాయక్ ఆరోపించారు. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలు ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్యానాయక్ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, రైతులు పండించిన పంట ఉత్పత్తులను మొత్తం కొంటామని ప్రకటిస్తూ, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకుండా రైతులను నానా గోస పంచుకుంటున్నారని విమర్శించారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా, రైతులు పండించిన పంట ఉత్పత్తులను పూర్తిగా కొనాలని, కొనుగోలు కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలని, గన్నీ కొరత తీర్చాలని, కాంటాలు పూర్తిచేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గుడిపూడి నవీన్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






