16 July, 2026 | 1:45 AM

ప్రజా సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధర్నా

16-07-2026 01:44 AM

చౌటుప్పల్, జూలై15 : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డులో మాజీ శాసనసభ్యులు, మునుగోడు నియోజకవర్గ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యం, నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వలిగొండ జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చి, పనులు వేగంగా జరిగేలా కృషి చేశారన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి కారణంగా రహదారి పనులు తీవ్ర జాప్యానికి గురయ్యాయని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రజల సమస్యల కంటే మంత్రి పదవిపైనే ఆసక్తి ఎక్కువగా ఉందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

గత 15 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి తీసుకురాలేకపోయారని ఆరోపించారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు, సర్పంచులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.