మాజీ ఎమ్మెల్యే రేగా అరెస్ట్!
- బెంగళూరులో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
- ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును హైదరాబాద్ పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్టుచేశారు. రేగాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 26న లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం విధితమే.
ఈ మేరకు తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, కొట్టి వేయాలంటూ రేగా కాంతారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటీషన్ దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో పిటీషన్ కోర్టు తిరస్కరించింది. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న రేగాను హైదరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.






