14 August, 2026 | 1:57 AM

ఎరువుల కోసం సొసైటీకి తాళం

14-08-2026 12:40 AM

సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో ఘటన

గంభీరావుపేట, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు సింగిల్ విండో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. యాప్‌లో యూరియా బుక్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపినా, యాప్‌లో బుకింగ్ కాకపోవడంతో రైతులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పంటలకు సరిపడా యూరియా దొరకడం లేదని, టెక్నాలజీ వల్ల సౌలభ్యం కాక ఇబ్బందులు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. యాప్ విధానాన్ని రద్దుచేసి యూరియాను నేరుగా అందించాలని డిమాండ్‌చేశారు.