calender_icon.png 15 December, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

13-12-2025 01:41:09 AM

  1. లాతూరులో తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ నేత

ఒకే లోక్‌సభ స్థానం నుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన నేతగా రికార్డు

లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు

ముంబై, డిసెంబర్ ౧౨: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ (౯౦) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తుదిశ్వాస విడిచారు. రాజకీయ దురంధరుడిగా శివరాజ్‌పాటిల్‌కు పేరుంది. ఆయన ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా రు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించారు. సమర్థుడైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.

 కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు అలంకరించారు. లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర హోం మంత్రిగా సహా పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. 1935 అక్టోబర్ 12న ఆయన లాతూ ర్ జిల్లాలోని చకూర్ ప్రాంతంలో జన్మించారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1967లో లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

1972, 1978లో రెండుసార్లు లాతూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. లాతూరు లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా ఏడు సార్లు (1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999) ఎంపీగా గెలిచారు. 1991 96 వర కు లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. ఆయన హయాంలోనే పార్లమెంటు కార్యకలాపాల ప్రసారం కోసం సాంకేతికత అందు బాటులోకి వచ్చింది. పార్లమెంట్‌లో లైబ్రరీ భవన నిర్మాణం పూర్తయింది.

2004లో ఆయన కేంద్ర హోం మంత్రిగా సేవలందించారు. 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. ఆయన మర ణం తనను కలచివేసిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.