13-12-2025 01:39:53 AM
పది మంది తలలపై రూ.33 లక్షల రివార్డు
వివరాలు వెల్లడించిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శుక్రవారం బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు 10 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారి పై రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. హింసా మార్గాన్ని వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా ఐజీ పిలుపునిచ్చారు.
లొంగిపోయిన వారిలో మావోయి స్టు కంపెనీ ప్లాటూన్ కమాండర్ మిడియం భీమా ఒక్కడిపైనే రూ.8 లక్షల రివార్డు ఉంది. అలాగే గంగా కుంజమ్, లేకం రామ, తటి సోనీ, శాంతి సోధిపై ఒక్కొక్కరి తలలపై రూ.5 లక్షల చొప్పున, మరో ఐదుగురిపై ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. లొంగిపోయిన వారు ఒక ఏకే-47 రైఫిల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, స్టెన్‌గన్, బ్యారెల్ గ్రెనే డ్ లాంచర్ (బీజీఎల్) వంటి ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
16న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ
ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీప్రాంతం జీఎం వలస పంచాయతీ పరిధిలో గత నెల నవంబర్ 19న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మరణించిన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. దీనిలో భాగంగానే ఈనెల ౧౬న రంపచోడవరం సబ్-కలెక్టర్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)తోపాటు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ సాగనుంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల కుటుంబ సభ్యులతోపాటు భద్రతా దళాలను విచారించనున్నారు.
దీనిలో భాగంగానే పోలీసు అధికారులు, మధ్యవర్తులు, పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు రంపచోడవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలో తమ వాంగ్మూలాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఘటన గురించి ఏదైనా సమాచారం, ఆధారాలు లేదా సాక్ష్యం ఉన్న ఏ పౌరుడైనా కూడా అదే రోజు హాజరై తమ స్టేట్‌మెంట్‌లను సమర్పించవచ్చని ఉత్తర్వులు పేర్కొంటున్నాయి.