23 March, 2026 | 11:45 PM

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తో ప్రజా జీవనం అల్లకల్లోలం

23-03-2026 09:48 PM

స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన మనుగడ నీవెక్కడ?

ఈ జవహర్ నగర్ కు ఏమైంది? అంటూ బహిరంగ సభ

ఏళ్లకు పైగా నివసిస్తున్నా భూమిపై హక్కుల ఊసే లేదు?

క్రాంతి కళాబృందం వ్యవస్థాపకుడు వెంకటాచారి ఆధ్వర్యంలో సదస్సు

ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి విమలక్క

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్  డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవితం జవహర్ నగర్ ప్రజలకు లేదా..? ఈ జవహర్ నగర్ కు ఏమైంది..? అంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి విమలక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో క్రాంతి కళాబృందం ఆధ్వర్యంలో ఈ జవహర్ నగర్ కు ఏమైంది..? అంటూ క్రాంతి కళాబృందం వ్యవస్థాపకుడు వెంకటాచారి ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి విమలక్క హాజరై మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ హైదరాబాదులో విలీనమైనా జవహర్ నగర్ అభివృద్ధికి నోచుకోవడం లేదని పాలకులే రియల్ బ్రోకర్లుగా అవతారం ఎత్తుతూ పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. డంపింగ్ యార్డ్ రాంకీ సంస్థ ఆగడాలతో జవహర్ నగర్ లోని మూడు లక్షల జనాభా ఆరోగ్యం గాల్లో దీపమైందని ఏలనాటి నుండి నివాసం ఉంటున్న భూమిపై హక్కులు ప్రజలు పొందకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

మినీ భారత్ గా పేరుగాంచిన జవహర్ నగర్ అభివృద్ధిలో ఆమడ దూరంలో వెనుకబడి ఉందని, జవహర్ నగర్ లో ఎక్కువగా గరీబోళ్లే నివసిస్తున్నారని రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారి వని తెలిపారు. జవహర్ నగర్ లో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, చివరకు తినే తిండి కూడా కాలుష్యం అయిపోయిందని ఆవేదన వెలుబుచ్చారు. ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. జవహర్ నగర్ ను స్వచ్ఛ జవహర్ నగర్ గా మార్చకపోతే రాబోవు తరాలు మనము క్షమించవని తెలిపారు.

డంపింగ్ యార్డ్ వల్ల జవహర్ నగరే కాక చుట్టుపక్కల ప్రాంతాలైన దమ్మాయిగూడ, నాగారం, అహ్మద్ గూడ,  కీసర, రాంపల్లి, ఘట్కేసర్, చర్లపల్లి తదితర ప్రాంతాలు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. ఇకనైనా పాలకులు మేల్కొని జవహర్ నగర్ డంపింగ్ భూతం నుండి ప్రజలకు విముక్తి కలిగించి, స్వచ్ఛ జవహర్ నగర్ కు తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత మత్తులో తిరుగుతోందని 350 బెల్ట్ షాపులతో జవహర్ నగర్ పూర్తిగా మత్తుమయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విష వాయువుల నుండి స్వేచ్ఛ వాయువు దిశగా పోరాటం చేయాలని క్రాంతి కళాబృందం గలమెత్తిందని వెంకటాచారి తెలిపారు. జవహర్ నగర్ సమస్యలపై కళాకారులు పాట రూపంలో ధూమ్ ధాం ఆటపాటలతో గల మెత్తి ప్రభుత్వానికి వినిపించేలా ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, దరువు అంజన్న, మల్లెపూలశ్రీకాంత్ యాదవ్, దశరథ్, ఎస్.కె మీరా, నిర్మల, అశోక్, సుధాకర్ ,ముఖేష్, నిహారిక గౌడ్, శ్రీనివాస్, తిరుపతి, ఆంజనేయులు, ప్రకాష్, ప్రజా కళాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.