కరీంనగర్‌లో కవల పిల్లల హత్య— కన్నతండ్రితో సహా నలుగురు అరెస్ట్
కరీంనగర్,(విజయక్రాంతి): సొంత బిడ్డలనే కాలయముడిలా మారి బావిలో ముంచి చంపిన దారుణ ఘటనలో కన్నతండ్రితో(Father) పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) అరెస్ట్ చేశారు. ఆస్తిపై మక్కువతో, ఆడపిల్లలనే వివక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.
ఘటన నేపథ్యం
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ నివాసి కచ్చు శ్రీశైలం (28), ప్రతిమ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 2020లో మౌనికతో ఇతనికి వివాహం కాగా, 2022లో వీరికి కవల ఆడపిల్లలు గీతంశి, గీతన్విక జన్మించారు. అయితే మొదటి నుండి మగపిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలంకు, ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు. సుమారు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య మరియు తమ్ముడు రాకేష్‌తో కలిసి పిల్లలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.
పథకం ప్రకారం హత్య
ఏప్రిల్ 3న, పథకం ప్రకారం నిందితుడు శ్రీశైలం తన భార్యను ఇంట్లోనే ఉండమని చెప్పి, బలవంతంగా ఇద్దరు కుమార్తెలను మోటార్ సైకిల్‌పై పొలం వద్దకు తీసుకెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి, నలుగురు నిందితులు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం, శ్రీశైలం ఇద్దరు చిన్నారులను వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. నీటిలో మునిగిపోతున్న గీతంశి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, తనే బావిలోకి దిగి ఆమెను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, పిల్లలను కాపాడబోతున్నట్లుగా నటిస్తూ కేకలు వేశాడు.
విచారణ నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు గోపాల్‌పూర్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఆదివారం ఏప్రిల్ 5 మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, సి.ఐ. నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందిని కరీంనగర్ సి.పి. గౌష్ ఆలం అభినందించారు.




