27 February, 2026 | 4:24 AM

కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కేనో..?

27-02-2026 12:50 AM

ఒక్కో మునిసిపాలిటీలో నలుగురికి అవకాశం

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..

ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

మెదక్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మ న్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకా లం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో కో ఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రా న్, రామాయంపెట్ మునిసిపాలిటీల్లో కో ఆప్షన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది.

ఎంత మందికో అవకాశం...! 

కో ఆప్షన్ పదవులు త్వరలో భర్తీ కానున్న నేపథ్యంలో ఎంతమందికి అవకా శం కల్పిస్తారోనన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నలు గురికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 16 పైచిలుకు కో ఆప్షన్ పదవులు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నా యి. నిబంధనల ప్రకారం ఒక్కో మున్సిపాలిటీల్లో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. అయితే మున్సిపాలిటీ ల గ్రేడ్ను బట్టి సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంది.

 ఒక్కో మున్సిపాలిటీల్లో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు... 

మునిసిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో పలు నిబంధనలను పాటించవలసి ఉంటుంది. ఒక్కో మునిసిపాలిటీ పరిధిలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులను నియమించిన పక్షంలో వారిలో పరిపాలన అనుభవం కలిగిన వారికి రెండు పోస్టులు కేటాయిస్తుండగా, అందులో ఒకటి మహిళకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కో ఆప్షన్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిష్టర్ అయి ఉండటంతోపాటు 21 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి.

మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ మొదలుకొని వార్డు సభ్యుని వరకు ఎందులోనైనా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా పాలన సాగించి ఉండాలి. అలాగే అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన వారికి మరో రెండు పోస్టులు కేటాయిస్తారు. అందులో కూడా ఒక పోస్టును మహిళకు రిజర్వు చేసే ఛాన్స్ ఉంది.

ఈ పదవులకు దరఖాస్తులు చేసే అభ్యర్థులు ఓటర్ జాబితాలో రిజిష్టర్ అయి ఉండటంతోపాటు 21 సంవత్సరముల పైబడి వయస్సు ఉండాలి. ఆశావహులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారై ఉండాలి. అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలతోపాటు రుజువు పత్రాలతో నిర్ణీత తేదీలోపు కమిషనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్ మైనారిటీ వర్గానికి చెందిన వారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్ అయిన ఉద్యోగులు, అలాగే ఐదేళ్లకన్నా తక్కువ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యుడిగా పని చేసిన మాజీ ప్రజాప్రతినిధులు కో ఆప్షన్ సభ్యుల పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 

ఎమ్మెల్యేల ఆశీస్సులు ఎవరికో... 

జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలకు చెందిన కో ఆప్షన్ పదవులు ఆశించే వారు ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేల చేతుల్లోనే కో ఆప్షన్ పదవుల భర్తీ ఉండటంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు పదవులకు విపరీతమైన పోటీ నెలకొనడంతో ఒకేచోట ఇద్దరు, ముగ్గురు బరిలో ఉన్న స్థానాల్లో ముఖ్యులకు పలువురికి కో ఆప్షన్ పదవుల పేరుతో బుజ్జగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేల హామీతో కౌన్సిల్ బరి నుంచి తప్పుకున్న వారు, బరిలో నిలిచి ఓడిపోయిన వారు ప్రస్తుతం కో ఆప్షన్ పదవులు ఆశిస్తున్నారు. దీంతో అలాంటి వారికి ఎమ్మెల్యేలు కో ఆప్షన్ పదవులు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.