27 February, 2026 | 4:30 AM

నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు

27-02-2026 12:53 AM
  1. ప్రచారానికే పరిమితమైన సేంద్రియ ఎరువుల తయారీ

గ్రామాల్లో రోడ్లపైనే దర్శనమిస్తున్న చెత్తాచెదారం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

బూర్గంపాడు,ఫిబ్రవరి26(విజయక్రాంతి): గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్ధాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. కానీ వాటి నిర్వహణను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవ డంతో ప్రస్తుతం షెడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజాధనం వృథాగా మారి ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుంది.

ప్రతి పంచాయతీలో ప్రారంభంలో కొంతమేర ఆసక్తి కనబరిచిన అధికారులు వాటిని పట్టించుకోవడం మరిచారు. గ్రామాల్లో ఇండ్ల నుండి సేకరించిన తడిపొడి చెత్తను సేకరించి షెడ్లలోని కంపార్ట్మెంట్లలో వేయాలి. సేకరించిన చెత్తతో ఎరువులు తయారుచేసి ఆ ఎరువులను రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీలకు ఆధాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం, స్వచ్చత మెరుగుపరచాలని భావించింది. అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కంపోస్టు షెడ్లు ప్రస్తుతం నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..

తడిపొడి చెత్త కూరగాయలు, ఆహార వ్యర్ధాలు, గడ్డి, పేపర్లు కంపోస్టు గదుల్లో వేరుచేసిన అనంతరం వాటిని ఎరువులుగా మార్చి విక్రయించాల్సి ఉంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ఈ విధానాన్ని పాటించి ఆదాయాన్ని మెరుగుపరుచుకోకుండా పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైన అధికారులు వీటిని పట్టించుకొని ఉపయోగం తీసుకుంటు ఎరువులను విక్రయిస్తు ఆదాయం పొందాలని ప్రజలు కోరుతున్నారు.

రహదారుల వెంట చెత్తాచెదారం..

మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో చెత్తను సిబ్బంది డంపింగ్ యార్డులకు తరలించకుండా ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. దీంతో చెత్త నుండి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. అంతేకాకుండా చెత్తను కాల్చివేయడంతో విపరీతమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోని చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.