వాట్సాప్‌లో ట్రేడింగ్.. 2 కోట్లు టోకరా!
పుణెలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం
పుణె, మే 27: సైబర్ నేరగాళ్లు సామాన్యులను కొల్లగొట్టేందుకు కొత్తకొత్త మార్గాలను వెదుకుతున్నారు. మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు, స్పామ్‌కాల్స్ ఇలా ఎన్నో మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా మహా రాష్ట్రలోని పుణెలో వాట్సాప్ గ్రూప్ పెట్టి భారీ మొత్తంలో కాజేశారు.
ఇలా మోసం చేశారు
పుణెకు చెందిన చర్‌హోలీ బద్రుక్ (53) అనే వ్యక్తి ఫోన్‌నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు జనవరిలో ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. తాము నిర్వహిస్తున్న ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆ గ్రూప్‌లో సందేశాలతో నమ్మించారు. గ్రూప్ అడ్మిన్ల సూచన మేరకు బాధితుడు ‘షేర్ ట్రేడింగ్ అకౌంట్’ను ఓపెన్ చేశాడు. తన సోదరుడితో కూడా అకౌంట్ ఓపెన్ చేయించాడు. తర్వాత గ్రూప్ అడ్మిన్ల సూచనల మేరకు అన్నదమ్ములు షేర్లు కొనటం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం మొత్తం నిర్వహించేందుకు సైబర్ నేరగాళ్లు స్క్రీన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారు. దీనివల్ల షేర్ల ట్రేడింగ్ జరుగుతున్నట్టు, పెట్టుబడిదారులకు భారీగా లాభాలు వస్తున్నట్టు కనిపి స్తుంది. కానీ, వాస్తవంగా అవేవీ ఉండవు. అడ్మిన్లు మూడు బ్యాంకు అకౌంట్లు పంపి అందులో డబ్బులు వేస్తే ట్రేడింగ్ మొదలవుతుందని చెప్పారు.
దీంతో బద్రుక్ ఆయా అకౌంట్లకు రూ.2,67,80,000 పంపాడు. తన సోదరుడి చేత రూ.77,50,000 పం పించాడు. కొద్దిరోజులకు వారికి రూ.8 కో ట్లు లాభం వచ్చినట్టు సైబర్ నేరగాళ్లు నమ్మించారు. భారీగా లాభాలు వచ్చాయి కదా అని గత మార్చిలో ఆ డబ్బును తీసేసుకోవటానికి బాధితుడు ప్రయత్నించగా, ‘మీ అకౌంట్‌ను సెబీ, ఇతర ఏజెన్సీలు లాక్ చేశా యి’ అని సైబర్ నేరగాళ్లు తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం రావ టంతో మోసపోయామని అర్థంచేసుకొన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచిత్రం ఏమిటంటే బాధితులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. కానీ, వారు వాడుతున్నది ఒక మోసపూరిత సాఫ్ట్‌వేర్ అని గుర్తించలేకపోయారు.






