28 July, 2026 | 6:26 AM

భగవంతునికే ఎరుక!

28-05-2024 12:05 AM

జూన్ 4 తర్వాత ఈడీకి మోదీ చెప్పే సమాధనం ఇదే

మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు

అందుకే ఇంటర్వ్యూలో పరమాత్మ కథ చెప్పారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

బీహార్, మే 27: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. తనను దేవుడే పంపాడని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ సైటైర్లు వేశారు. జూన్ 4 తర్వాత ఈడీ ప్రశ్నిస్తే భగవంతుడిపైనే భారం వేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. బీహార్‌లో  జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మోదీ పరమాత్మ కథ ఎందుకు చెప్పారో మీకు తెలుసా? ఎన్నికల తర్వాత అదానీ గురించి మోదీని ఈడీ ప్రశ్నిస్తుంది. అప్పుడు మోదీ.. నాకేం తెలియదు.అంతా భగవంతుడు చెప్తేనే చేశా అంటారు. మోదీజీ.. ఇప్పటికైనా ఈ సుదీర్ఘ ప్రసంగాలు ఆపండి. దేశ సమస్యలపై మాట్లాడండి. దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేయకండి. మీరు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి అని ప్రశ్నించారు. అంతేకాకుండా మోదీ మరోసారి ప్రధాని కాలేరని, దేశంలో ఇండియా కూటమికి బలమైన మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.  

వాళ్ల కోసమే పనిచేస్తున్నారు..

అనంతరం హిమాచల్‌ప్రదేశ్‌లోని నహన్ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. దేశంలోని 22 మంది కోటీశ్వరుల కోసమే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ పదేళ్లలో వాళ్లకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, కానీ రైతుల అప్పుల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. జీఎస్టీ వేసి చిన్న వ్యాపారాలను నాశనం చేశారని ఆరోపించారు. మీడియా కూడా ధనవంతుల పెళ్లిళ్లపైనే ఆసక్తి చూపిస్తోందని విమర్శించారు. ప్రజల తరఫున గళం వినిపించేందుకు ఢిల్లీలో సైనికులుగా తన సోదరి ప్రియాంకతో కలిసి పనిచేస్తానని రాహుల్  వెల్లడించారు. హిమాచల్‌లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కేంద్రం సాయం చేయలేదని  చెప్పారు. అదానీ పట్ల మోదీ అభిమానం చూపడం వల్ల యాపిల్ రైతులకు బకాయిలు అందడం లేదని రాహుల్ ఆరోపించారు. యాపిల్ స్టోరేజీ హక్కులను అదానీకే కట్టబెట్టారని, ఆయన ధరలు నియంత్రిస్తున్నారని మండిపడ్డారు.