calender_icon.png 18 September, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాఫీ తోటల పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం..!

18-09-2025 08:09:36 AM

నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంత వాసుల నుండి ఏడు కోట్లకు పైగా టాకరా.

నలుగురు అండమాన్ నికోబార్ దీవులు ప్రాంత వాసుల అరెస్ట్. 

 నాగర్ కర్నూల్  (విజయక్రాంతి): అండమాన్ నికోబార్ దీవుల్లోని కాఫీ తోటల పెట్టుబడుల పేరుతో నలుగురు అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల వాసులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంత వాసులతో ఏడు కోట్లకు పైగా అధిక వడ్డీ ఆశ చూపి కుచ్చు టోపీ పెట్టారు. రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి సహాయంతో అధిక సంఖ్యలోని ఆశావాహుల నుండి భారీగా డబ్బులు దండుకొని సొమ్ము చేసుకున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రాళ్ళ మాసయ్య 2017లో ఆర్మీ రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్లోని యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాడు.

ఆ క్రమంలో అండమాన్ నికోబార్ దీవులు( ఐస్లాండ్) ప్రాంతానికి చెందిన ఆర్.రోహన్, టి. ఆదిల్ అలీ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పరిచయమయ్యారు. వారు పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోవడంతో  గ్రొ లాండ్ అనే కొత్త కంపెనీ పేరుతో కాఫీ తోటలపై పెట్టుబడులు వాటిపై 25 శాతం అధిక వడ్డీ ఇస్తున్నట్లు రోహన్ తండ్రి రామ్, ఆదిల్ అలీ తండ్రి అలీ ఇద్దరూ మాసయ్య వద్ద నమ్మ బలికారు. ఈ క్రమంలో మొదట యాభై వేలు పెట్టుబడులు పెట్టి అధిక వడ్డీని పొందిన మాసయ్య పూర్తిగా నమ్మి ఇంటి వద్ద భూమి ఇల్లు నగలు అమ్ముకొని కోటి 60 లక్షలు సొంతంగా పెట్టుబడి పెట్టి అత్యధికంగా డబ్బు పొందాడు. దీంతోపాటు ప్రతి నెల 30 వేల జీతం ఇస్తానంటూ ఎక్కువ మందిని చేర్చాలని నిందితులు గాలం వేశారు. దీంతో సదరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన సోదరులు,  సన్నిహితులు ఇతర వ్యక్తుల చేత నాగర్ కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాల వారితో సుమారు 7 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టించారు.  కొద్దిరోజులు అధిక వడ్డీ బాగానే ఇస్తూనే హఠాత్తుగా మాయమయ్యారు. దీంతో ఈ ప్రాంత బాధితులంతా మాసయ్యపై ఒత్తిడి తేవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం ఈ ఏడాది మే ఐదున నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంకు లావాదేవీలు, టోకెన్లు, విమాన టికెట్లు ఆధారంగా అండమాన్ నికోబార్ దీవుల్లో దాగివున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.