3 April, 2026 | 3:10 AM

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం

03-04-2026 12:49 AM

అంతర్రాష్ట్ర సైబర్ గ్యాంగ్ అరెస్ట్

నాగోల్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): అధిక లాభాల మాయ చూపించి ఆన్లైన్లో లక్షల రూపాయలు దోచుకున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల గ్యాంగ్ను ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ ఎస్.వి. నాగలక్ష్మి వెల్లడించారు. హైదరాబాద్ నాగోల్కు చెందిన గుర్రం నవీన్ చందర్ (35) అనే లెక్చరర్ ఫిబ్రవరి 18న ఒక వాట్సాప్ గ్రూపులో చేరాడు. బార్ క్లేస్ పేరుతో ఉన్న ఆ గ్రూపులో ట్రేడర్లుగా పరిచయమైన నిందితులు నకిలీ ట్రేడింగ్ ప్లా ట్ఫామ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు.

ప్రారంభంలో భారీ లాభా లు వచ్చినట్లు చూపిస్తూ అతని విశ్వాసం గెలుచుకున్నారు. దీంతో నవీన్ చందర్ పలు దఫాలుగా మొత్తంగా రూ.36.35 లక్షలు పెట్టుబడిగా పంపించాడు. అయితే తిరిగి కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి మోసం చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు.

దర్యాప్తులో ఈ మోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు గుర్తించారు. మార్చి 31న ప్రత్యేక బృందం పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లి కల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదమీరం గ్రామంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో కడలి రేవంత్ కుమార్, విద్యాచరణ్, శివ వర్మ, పవన్, ఎం. శివ, కడలి చంద్రశేఖర్, కార్తికేయ వర్మ, నొద్దాని శివతో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 టాబ్లెట్లు, 40 చెక్‌బుక్స్, 20 డెబిట్/క్రెడిట్ కార్డులు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.