15-10-2025 08:04:47 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి ప్రాధమిక పశువైద్య కేంద్రంలో బుధవారం స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశమంతటా 2019 నుండి ఈ వైరస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రతీ రాష్ట్రంలో ఈ టీకాలను ఆరు నెలలకు ఒకసారి పశువులకు వేయడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు అని తెలిపారు. మూగజీవుల ఇబ్బందులను వాటికి కావలసిన అవసరాలను పశు వైద్య సిబ్బంది చెబితే వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని విలువైన పశువులను కాపాడుకుందాం - గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందుదాం అని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా జంతు వ్యాధుల నిర్థారణ ల్యాబ్ సహాయ సంచాలకులు డాక్టర్ నాగమణి, జిల్లా పశు వైద్య పశుసంవర్ధక అధికారి డాక్టర్ రాధా కిషన్ లు మాట్లాడుతూ ఈ వైరస్ వ్యాధి వ్యాపించిన పశువులలో అధిక జ్వరం రావడం, నోటిలో, డెక్కల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు మేత మేయకపోవడం వల్ల రోజు రోజుకు క్షీణించి, పాల దిగుబడి తగ్గి రైతుకు నష్టం కలుగుతుంది. కొన్ని పశువులు మేత మేయకపోవడం వల్ల చనిపోతాయని అని తెలిపారు. ఈ టీకాలను అక్టోబర్ 15 వ తేదీ నుండి నవంబర్ 14 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పశువులకు ఉచితంగా వేస్తారని రైతులు పశువులన్నింటికీ టీకాలు వేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, 60 డివిజన్ అధ్యక్షుడు ఎనుకొంటి పున్నం చందర్, వడ్డేపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కటకం ప్రసాద్, ఫిషర్ మాన్ సభ్యులు మండల సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్, బుస నవీన్ కుమార్, మిడిదొడ్డి శేఖర్, మట్టపల్లి కమల్, పిట్టల వంశీ, ఎండి సాజిద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వినయ్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.