calender_icon.png 18 February, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నిర్మూలన సమిష్టి బాధ్యత

18-02-2026 04:22:20 PM

- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని, అధికారులతో పాటు ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.

పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ లో అమ్మకాలను పరిశీలించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.

జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.