calender_icon.png 16 October, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలి

15-10-2025 08:03:01 PM

గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు బంద్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

మెదక్ (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు.

రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ కూడళ్ల వద్ద, మెడికల్ షాప్ లు, పరిశ్రమల వద్ద తనిఖీలు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ డాబాల వద్ద, వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.