14-11-2025 10:34:29 PM
గజ్వేల్: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా భారతీయ వైద్య సంఘం (IMA) గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం, దాచారం గ్రామంలో నిర్వహించిన ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం విజయవంతం అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ శాఖ వైద్యులు గ్రామస్తులకు మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు.
ఈ సందర్భంగా ఐఎమ్ఎ గజ్వేల్ శాఖ అధ్యక్షులు డా.పద్మజ్యోతి మాట్లాడుతూ మధుమేహం టైప్ 2, టైప్ 1 రెండు రకాలుగా ఉంటుందన్నారు. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవాలని, లేనిచో శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించి ఆరోగ్యం పాడైపోతుందన్నారు. ఐఎమ్ఎ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డా.నరేశ్ బాబు మాట్లాడుతూ క్రమబద్ధమైన దినచర్య, ఆరోగ్య కరమైన ఆహార నియమాలు పాటించడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. శీతల పానీయాలు, బేకరి మరియు జంక లాంటి ఆహార పదార్థాలు వాడకూడదని తెలిపారు.
ఐ.ఎమ్.ఎ. అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ కోశాధికారి డా. పెంటాచారి మాట్లాడుతూ నియమబద్ధంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఔషధాలు సక్రమంగా వాడాలని, ప్రతి దినము వ్యాయామం, యోగా, ప్రాణాపాయం చేయడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందన్నారు. ఈ శిబిరంలో 148 మందికి వైద్య పరీక్షలు, 94 మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 26 మందికి డయాబెటిస్ యాది ఉన్నట్లు గుర్తించి మందులు పంపిణీ చేశారు. రోగులకు ఉచితంగా ఔషధాలు అందజేయడం జరిగింది.