నిమ్స్ పారామెడికల్ విద్యార్థినులకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ
పంజాగుట్ట, జూన్ 16 (విజయక్రాంతి): నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల విద్యార్థినులకు క్యాన్సర్కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ నుంచి రక్షణ కోసం ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిగుమర్తి ఫౌండేషన్ సహకారంతో మంగళవారం కళాశాలలో విద్యార్థినులకు ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన నిమ్స్ డీన్ డాక్టర్ చంద్రశేఖర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
క్యాన్సర్ నివారణ, చికిత్సల కోసం నిరంతరం సేవలందిస్తూ ఈ విలువైన వ్యాక్సిన్ను ఉచితంగా అందించిన నిమ్స్ పూర్వ ఆచార్యులు, దిగుమర్తి ఫౌండేషన్ అధిపతి డాక్టర్ రఘునాథ రావు, డాక్టర్ నీలల సేవలను డీన్ ఈ సందర్భంగా కొనియాడారు. కొత్తగా నియమితులైన డీన్ డాక్టర్ చంద్రశేఖర్ను కళాశాల తరపున సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నిమ్స్ అసోసియేట్ డీన్ మాట్లాడుతూ.. ఎలాంటి అపోహలు లేకుండా వివాహానికి ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వికల్, యానల్, గొంతు, జననేంద్రియ క్యాన్సర్లను, మొటిమలను నివారించవచ్చన్నారు. నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బలక్ష్మి, డాక్టర్ చందన పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి సహకరించిన వైద్యులకు, ఫౌండేషన్ ప్రతినిధులకు కళాశాల ప్రిన్సిపాల్ శిరందాస్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.






