జీవిత ఖైదీలకు విముక్తి కలిగించండి
ప్రభుత్వానికి జీవిత ఖైదీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారికి క్షమాభిక్షపెట్టి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి షరీఫ్, రాజేష్, అనిల్ కుమార్ లు మాట్లాడారు.
ఆవేశపూరితంగా చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే వారిపైనే ఆధారపడి జీవితాలు వెల్లదీస్తున్న తమ కుటుంబాలకు పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమైన పిల్లలు, సోదరుడు దూరమై మరొకరు తండ్రి దూరమై పిల్లలు, వృద్ధాప్యంలో వయసులో ఉన్న కొడుకు దూరమై మరికొందరు నరకయాతన అనుభవిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో గాంధీ జయంతి సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.






