10 March, 2026 | 12:01 AM

సమాజంలో ఫార్మస్ట్‌ల పాత్ర కీలకం

07-03-2026 12:21 AM

విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు  

అబ్దుల్లాపూర్మెట్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

హైదరాబాద్, మార్చి 6(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంలో, ఔషధాలపై సరైన అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టల పాత్ర కీలకమని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు అన్నారు. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే (మార్చి 6)ను పురస్కరించుకుని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్,ఫార్మసీ విభాగం సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ  విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించేలా, సమాజ సేవలో భాగస్వాములను చేస్తూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు.ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు మానవీయ విలువలను అలవర్చుకోవాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఫార్మసీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, రోగులకు తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన చికిత్స అందేలా పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. భారత ఫార్మసీ విద్యా పితా మహుడు ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని ఆయన కోరారు.శిబిరంలో భాగంగా బీఫార్మసీ విద్యార్థులు స్థానిక ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో   సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్, అధ్యాపక బృందం, విద్యార్థు లు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.