10న అర్హత పరీక్ష
ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకండి
మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఐఐఐటి కళాశాలలో సీటు సాధించాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 50 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణకు ఎంపిక ప్రక్రియ నిమిత్తం అర్హత పరీక్షను ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు, మహబూబ్‌నగర్ నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గల మోడ్రన్ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అర్హత పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు మాత్రమే హాజరు కావలసి ఉంటుందని తెలిపారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అందరూ అర్హులేనని, అయితే ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఈ అర్హత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంపికైన విద్యార్థులకు జనవరి 19 నుంచి మార్చి 10 వరకు నిష్ణాతులైన అధ్యాపకుల బృందం పర్యవేక్షణలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సోంబూపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






