కబ్జా నుంచి విముక్తి
రాజేంద్రనగర్, మే 29 : గండిపేట్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గంధంగూడలోని కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ విభాగం స్వాధీనం చేసుకుంది. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలంలోని ప్రహారీగోడను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9.36 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లు పలుకుతుంది. దీంతో స్థానికంగా ఓ బీఆర్‌ఎస్ నాయకుడు ఈ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని భావించాడు. అందులో భాగంగా ఆ భూమికి పట్టా పాస్ పుస్తకాన్ని తయారు చేయించాలనుకున్నా డు. దీనికి బీఆర్‌ఎస్ కేబీనెట్‌లోని ఓ మంత్రి సహాయం తీసుకున్నాడు.
నాటి కలెక్టర్‌నూ ప్రభావితం చేసి ఆ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుందంటూ స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. నాడు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరూ సదరు భూమి జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ విషయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక దృష్టికి వచ్చింది. స్థలంపై నకిలీ పట్టాపాస్ పుస్తకాలు సిద్ధం చేసినట్లు ఆయన గుర్తించారు. దీంతో అడ్డదారిలో సంపాదించిన పట్టా పాస్ పుస్తకాలను రద్దు చేశారు. వెంటనే ప్రహారీగోడను కూల్చివేసి స్వాధీనం చేసుకోవాలని గండిపేట్ మండల తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో, బుధవారం రెవెన్యూ సిబ్బంది ప్రహారీగోడను కూల్చివేశారు. స్థలంలోని గుడిసెలను తొలగించారు. అనంతరం ఆ స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ కూల్చివేత నిర్వహించారు. ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






