ఎంఎంటీఎస్‌ను బలోపేతం చేయాలి
సీపీఐ(ఎం) గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): నగర ప్రజలకు అత్యంత చౌకగా ప్రయాణం అందుబాటులో ఉండేలా రూపొందించిన ఎంఎంటీఎస్ రైళ్లు సమయానికి రావడం లేదని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అన్నారు. ఈ రైళ్లల్లో ప్రయాణికులు 10 నుంచి 20 మంది కూడా ఉండటం లేదని తెలిపారు. రైల్వే అధికారుల నిర్వాకంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే ఎంఎంటీఎస్ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు.
ఫేజ్ కింద రూ. 800 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఎంఎంటీఎస్ రైళ్ల వల్ల ప్రయాణికులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోతోందన్నారు. రైళ్ల రాకపోకల సమయ పాలన ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదన్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలు సమయ పాలనను సమాచార హక్కు చట్టం ప్రకారం తెలుసుకోగా, నెలలో ఒక్క రోజు కూడా సరైన సమయానికి రాలేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






