1 August, 2026 | 3:48 AM

హైదరాబాద్-కరీంనగర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు

01-08-2026 02:10 AM

నివారణకు చర్యలు చేపట్టాలి

ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యదర్శికి బీఎస్పీ నేత పుల్లూరి ఉమేష్ వినతి

సిద్దిపేట, జూలై 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌ సిద్దిపేట కరీంనగర్ రాష్ట్ర రహదారి (స్టేట్ హైవే1)పై రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి ఉమేష్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆయన పేర్కొన్నారు.

రహదారిపై రిఫ్లెక్టివ్ స్టడ్స్, లేన్ మార్కింగ్స్, ఎడ్జ్ లైన్స్, క్యాట్ ఐస్ వంటి భద్రతా సూచికలు లేకపోవడంతో పాటు, రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ నియంత్రణ సూచనలు, రంబుల్ స్ట్రిప్స్, క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రహదారి వెంట అవసరమైన చోట్ల స్ట్రీట్ లైటింగ్, రిఫ్లెక్టివ్ సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, హైదరాబాద్‌కరీంనగర్ రాష్ట్ర రహదారిపై సమగ్ర భద్రతా చర్యలు అమలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని పుల్లూరి ఉమేష్ విజ్ఞప్తి చేశారు.