నిరుపేద విద్యార్థులకు వీ టూ హెల్ప్ చేయూత
రూ.45 వేల విలువైన బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ
నాగల్గిద్ద, జూలై 31: సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న వీ టూ హెల్ప్ యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాగల్గిద్ద మండలంలోని ముక్టపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.45 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిల్లు, చాక్లు తదితర విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. మొత్తం 66 మంది నిరుపేద విద్యార్థులకు ఈ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబూశెట్టి, మండల పిఆర్టియు అధ్యక్షులు శేరీకర్ రమేష్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతంలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అండగా నిలవాలని సంస్థ సభ్యులు కృష్ణ ప్రసాద్, అమర్నాథ్లను కోరారు.
పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సావిత్రి, దీక్షిత, భాస్కర్, గ్రామ సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లలిత, ఉపాధ్యాయులు లింగమేశ్వర్, సంగమేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






