గల్లీ నుంచి ఢిల్లీకి
పార్టీ ఆవిర్భావం నుంచి అంచలంచెలుగా ఎదిగిన కిషన్‌రెడ్డి
తెలంగాణ బీజేపీ ఎదుగుదలలో తనదైన ముద్ర
రెండోసారి కేంద్ర మంత్రి పదవితో గుర్తింపు
సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత పదవిని చేపట్టడం బీజేపీలో మాత్రమే సాధ్యమంటూ ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పే మాట కిషన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టతకు అనునిత్యం కృషి చేసిన గంగాపురం కిషన్ రెడ్డికి పార్టీ ఆది నుంచి తగిన గుర్తింపును ఇస్తూనే వస్తోంది.
కార్యకర్త నుంచి మొదలై జాతీయ స్థాయికి ఎదిగిన కిషన్‌రెడ్డి అంతకుముందు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతల నిర్వహణలోనూ తనదైన ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాలకు అదనపు సాయం, కరోనా వేళ సమర్థంగా పనిచేసి మోదీ క్యాబినెట్‌లో పదోన్నతి పొందారు. పర్యాటక, సాంస్కృతికశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను సైతం సమర్ధంగా నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి):
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర
విద్యార్థి దశ నుంచే రాష్ర్ట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కిషన్‌రెడ్డి.. జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయి సిద్ధాంతాలకు ఆకర్షితుడై విద్యార్థి దశలోనే జనతా పార్టీలో చేరారు. టూల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కిషన్‌రెడ్డి 1980లో ప్రారంభమైన బీజేపీతో తన అనుబంధాన్ని కొనసాగించారు. 1980 నుంచి 1994 వరకు బీజేపీ కార్యాలయంలోనే నివాసముంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1980లో రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన కిషన్‌జీ 2002లో బీజేవైఎం అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.
ఆ సమయంలోనే గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయం నుంచి నేపాల్ సరిహద్దు బిహార్ వరకు సరిహద్దు భద్రతా చైతన్య యాత్ర-( సీమా సురక్షా జాగరణ యాత్ర) నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ టెర్రరిజం అధ్యక్షుడిగా తీవ్రవాద ప్రభావిత దేశాల్లో పర్యటించి అనేక ఉగ్రవాద వ్యతిరేక సదస్సుల్లో కిషన్‌రెడ్డి ఉపన్యసించారు.
మొదటిసారి హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా
2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి, 2009లో అంబర్‌పేట్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2010లో ఉమ్మడి రాష్ర్ట బీజేపీ పగ్గాలు స్వీకరించి నాలుగేళ్ల పాటు పనిచేశారు. సౌమ్యుడిగా పేరు పొందిన కిషన్ రెడ్డి పార్టీని తనదైన శైలిలో ముందుకు నడిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2016 వరకు రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చివరి అధ్యక్షుడిగా.. తెలంగాణ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత కిషన్ రెడ్డికి దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా మరుసటి ఏడాది 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలిసారి ఎంపీ అయిన కిషన్‌రెడ్డికి మోదీ మంత్రివర్గంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా స్థానం దక్కింది.
30 ఏళ్ల క్రితమే మోదీతో దోస్తాన్
రెండోసారి క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డికి ప్రధాని మోదీతో 30 ఏళ్ల క్రితమే స్నేహం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. 1994లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు నాడు గుజరాత్ బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నేటి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పార్టీ ప్రతినిధిగా కిషన్‌రెడ్డి అమెరికా వెళ్లారు.
ఆ దేశ ప్రభుత్వ పనితీరు, ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేసేందుకు 45 రోజుల పాటు యూఎస్‌లో పర్యటించారు. అప్పుడు వారిద్దరూ కలిసి అనేక అంశాలపై, భవిష్యత్తు రాజకీయాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత ఎవరి బాధ్యతల్లో వారు బిజీ అయిపోయారు. 2014లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. కిషన్ రెడ్డి వద్ద ఉన్న అమెరికా వైట్ హౌస్ ముందు నిలబడి తీసుకున్న ఫొటోలను తెప్పించుకున్నారు. ఆ తర్వాత వైట్ హౌస్‌లోకి మోదీ అధికారికంగా వెళ్లి గత స్మృతులను నెమరువేసుకున్నారు.
రాజకీయ మైలురాళ్లు...
* 1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభం
* 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పూర్తిస్థాయి బాధ్యతలు
* 1980--81లో బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్
* 1982--83లో బీజేవైఎం రాష్ర్ట కోశాధికారి,
* 1983--84లో బీజేవైఎం రాష్ర్ట కార్యదర్శి
* 1986 -1990 బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు
* 1990 - 1992 బీజేవైఎం జాతీయ కార్యదర్శి, దక్షిణభారత ఇంచార్జ్
* 1992 - 1994 బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడు
* 1994 - 2001 బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి (వరుసగా మూడు పర్యాయాలు)
* 2001 - 2022 బీజేపీ రాష్ర్ట కోశాధికారి, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, బీజేపీ రాష్ర్ట కార్యాలయ ఇంచార్జ్
* 2002- 2004 బీజేవైఎం జాతీయాధ్యక్షుడు
* 2004 - 2005 ఆంధ్రప్రదేశ్ పార్టీ ప్రధానకార్యదర్శి , రాష్ర్ట అధికార ప్రతినిధి.
* 2004 -2009 హిమాయత్‌నగర్ ఎమ్మెల్యే
* 2009 -2014 అంబర్‌పేట ఎమ్మెల్యే.
* 2010 - 2014 బీజేపీ ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) రాష్ర్ట అధ్యక్షుడు
* 2014 - 2016 - తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు
* 2014 - 2018 అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యే.
* 2016 - 2018 బీజేఎల్పీ నాయకుడు
* 2019-2021 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
* 2021 -2024 సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి
* 2023 నుంచి నాలుగోసారి బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు
సికింద్రాబాద్‌షా.. కిషన్ జీ
గెలిచిన రెండుసార్లు వరించిన మంత్రి పదవి
హైదరాబాద్ సిటీబ్యూరో: ఎలాంటి రాజకీయ అండదండలు లేని కిషన్‌రెడ్డిని నమ్మిన సిద్ధాంతమే రెండుసార్లు కేంద్ర మంత్రి పదవుల్లో కూర్చోబెట్టింది. పార్టీ కార్యాలయమే నివాసంగా మార్చుకున్నాడనేంతగా ఆయన పడిన శ్రమకు పార్టీ కూడా ఆయన్ను అంతే స్థాయిలో వివిధ పదవులు, హోదాలతో అలంకరించింది. 1999లో కార్వాన్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో హిమాయత్‌నగర్, 2009, 2014 ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెందిన కిషన్‌జీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని మంత్రి వర్గంలో కేబినెట్ మంత్రిగా కొనసాగారు. తాజాగా సికింద్రాబాద్ నుంచే మరోసారి ఎంపీగా గెలిచిన కిషన్‌జీని రెండోసారి మంత్రి పదవి వరించడం ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయంగా నిలిచిపోనుంది.
ఉత్తమ రాజకీయ నాయకుడిగా గుర్తింపు
15 ఏళ్లు శాసన సభ్యుడిగా ఉన్నా ఏనాడూ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయకుండా కిషన్‌రెడ్డి హుందాగా వ్యవహరించారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఆయనపై విమర్శలు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా కిషన్ రెడ్డి ప్రవర్తించారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా నది ప్రాంతంలోని కృష్ణ గ్రామం నుంచి 2012లో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 24 రోజులపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొనసాగింది.
బాలల సమస్యలపై శాసనసభలో అత్యధిక సమయం మాట్లాడిన శాసనసభ్యుడిగా ఐరాస నుంచి బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్నారు. అమెరికా మేరీలాండ్ స్టేట్ గవర్నర్ చేతులమీదుగా దేశంలోని ఆదర్శ యువ నాయకుడిగా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండో అమెరికన్ వ్యాపార సంబంధాలను కొనసాగించే కమిటీల్లోనూ సభ్యుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారు. దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు హెల్ప్ లైన్, జిల్లాల్లో ఆయుష్ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
కరోనా వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’, విపత్తువేళ లాక్‌డౌన్ నిబంధనల రూపకల్పన, రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతలు పర్యవేక్షించారు. కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేసిన కిషన్‌రెడ్డి... మోదీ కేబినెట్‌లో పదోన్నతి పొందారు. ఇప్పుడు మరోసారి కేబినెట్ మంత్రిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
అవార్డులు, గౌరవాలు..
* ఐక్యరాజ్యసమితి ద్వారా.. బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ (2004--2009) (ఆంధ్రప్రదేశ్) అవార్డు.
* అమెరికాలోని మేరీలాండ్ ఇండియా బిజినెస్ టేబుల్ ద్వారా 2009 సంవత్సరానికి గానూ ‘ఔట్ స్టాండింగ్
యూత్ లీడర్‌షిప్ అవార్డు’.
* బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచశాంతికి చేసిన కృషికి గానూ బల్గేరియన్ కమాండోల ద్వారా మెడల్ ప్రదానం .






