12 July, 2026 | 9:40 AM

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

10-06-2024 01:32 AM

ఇక ఆన్‌లైన్‌లోనే ప్రతి ఫీడర్ వివరాలు  

ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపకల్పన 

ఫీడర్ ఆఫ్ అయితే సీఎండీ పర్యవేక్షించేలా చర్యలు 

అంతరాయం లేని సరఫరాపై స్పెషల్ ఫోకస్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి విద్యుత్ సరఫరాపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యుత్ సరఫరాలో పలు సందర్భాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలను సాకుగా చూపి ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ అధికారులు తిప్పికొడుతున్నారు.

సరఫరాలో అంతరాయాల అంశం విద్యుత్ శాఖకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీంతో విపక్షాలు చేస్తున్న విమర్శలకు, వివాదాలకు చెక్ పెట్టేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూనే, అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు.

అంతరాయంపై అధ్యయనం.. 

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం, సరఫరాలో చోటుచేసుకుంటున్న అంతరా యాలపై ఇటీవల ఉన్నతాధికారులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా 33 కేవీ, 11 కేవీ స్తంభాల లైన్లపై వినియోగించే మెటల్‌లో చేయాల్సిన మార్పులు, ట్రాన్స్‌ఫార్మర్ ఏబీ స్విచ్‌ల వద్ద తరచూ జంపర్ కట్ వలన అంతరాయాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హెచ్‌జీ ఫ్యూజ్, డీటీఆర్ స్ట్రక్చర్స్ వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పరిశీలించారు.

ప్రతి ఏడాది చేపట్టే నిర్వహణ, మరమ్మతు పనులను సమర్థవంతంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా చెట్లు, కొమ్మలు విద్యుత్ స్తంభాలపై, ఎల్‌టీ లైన్లపై పడుతుండడంతో పాటు బ్యానర్లు, ఫ్లెక్సీలు లైన్లపై పడతున్న కారణంగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను సైతం అధిగ మించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అదే క్రమంలో సరఫరా సమయంలో అత్యధికంగా అంతరాయం కలుగుతున్న ఫీడర్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, పునరావృత్తం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.