17 May, 2026 | 1:19 AM

భారత్‌లో ఇంధన మంటలు!

17-05-2026 12:00 AM

పశ్చిమాసియాలో రాజుకున్న చమురు మంటల సెగ భారతదేశాన్ని బలంగా తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన ముడిచమురు కొరత కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే గ్యాస్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పరిశ్రమల వర్గాలు, సామాన్యులపై దీనివల్ల మరింత భారం పడటం శోచనీయం.

కాగా, చమురు సంక్షోభం కారణంగా ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని పాలకులు సమర్థించుకోవడంపై ఇటు ప్రతిపక్షాలు, అటు సామాన్య ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దేశ చమురు అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతున్నదనేది కాదనలేని వాస్తవం.

క్రూడాయిల్ ధరలు పెరిగినా, రూపాయి విలువ తగ్గినా అంతిమంగా భారం మోయాల్సిందే సామాన్యులేనన్న నిజాన్ని విస్మరించలేం. కానీ, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కంపెనీలకు ఒనగూడిన లాభాలను ప్రజలకు ఎందుకు బదిలీ చేయడం లేదన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ పోరు మూలంగా రష్యా నుంచి భారత్ రెండేళ్ల పాటు అతి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.

అంతేకాకుండా, అమెరికా ఆంక్షలకు తలొగ్గి రష్యా నుంచి చౌకైన చమురు కొలుగోలును ఎందుకు నిలిపివేశారని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో డీజిల్, పెట్రోల్‌లపై కేంద్ర, రాష్ట్ర పన్నులు అధికంగా ఉండటమే ధరలు రెక్కలు విచ్చుకోవడానికి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయాలను పక్కనపెడితే, ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు తడిసి మోపెడై రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది.

ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో భారత్ ఇంధన పొదుపుతోపాటు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంతోపాటు వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా దశాబ్దాలుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా పరిణమించిన చమురు దిగుమతులను దశలవారీగా తగ్గించుకోవాలి. లేకపోతే ఏదో ఒక రోజు చమురు సంక్షోభం కార ణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.